ఉమర్ అక్మల్ మరో ఫిక్సింగ్ బాగోతం వెలుగులోకి..!క్రమశిక్షణ తప్పి నిషేధానికి గురైన పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్‌‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)‌లో ఫిక్సింగ్‌ కోసం ఈ ఏడాది ఆరంభంలో బుకీలు ఉమర్‌ అక్మల్‌ని సంప్రదించగా.. ఆ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక శాఖ అధికారుల వద్ద ఉమర్ దాచాడు. దాంతో.. అతనిపై పీసీబీ మూడేళ్ల నిషేధం విధించింది. అతని తగిన శిక్ష పడిందని పాక్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. అతని తమ్ముడు కమ్రాన్ అక్మల్ మాత్రమే పెద్ద శిక్ష వేశారంటూ బాధపడుతున్నాడు.

వాస్తవానికి 2010లోనే ఉమర్ అక్మల్‌ ఫిక్సర్లతో కలిసి పనిచేశాడని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ జుల్కర్నైల్ హైదర్ ఆరోపించాడు. 2010, నవంబరు 2న దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో తాను బ్యాటింగ్ చేస్తుండగా.. మైదానంలోకి డ్రింక్స్ తీసుకొచ్చిన నెమ్మదిగా ఆడాలని తనకి సూచించినట్లు హైదర్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో హైదర్ 9 బంతులాడి రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేయగా.. పాకిస్థాన్ ఆఖరికి 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.

‘‘దక్షిణాఫ్రికాతో అది చాలా కీలకమైన మ్యాచ్. నేను బ్యాటింగ్ చేస్తుండగా.. ఉమర్ అక్మల్ డ్రింక్స్ తీసుకుని నా వద్దకు వచ్చి నెమ్మదిగా బ్యాటింగ్ చేయాల్సిందిగా సూచించాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోవాలని అతను ఆశిస్తున్నట్లు మాటల్ని బట్టి నాకు క్లియర్‌గా అర్థమైంది. దాంతో నేను.. నీ డ్యూటీ డ్రింక్స్ అందించడం.. ఆ పని సక్రమంగా చెయ్..! అని సూచించాను. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఉమర్ అక్మల్ మాటల్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కి తెలియజేశాను. దాంతో.. తర్వాత మ్యాచ్‌ నుంచే నాకు బుకీల నుంచి బెదిరింపులు మొదలవడంతో నేను ఇంగ్లాండ్‌కి వెళ్లిపోయాను’’ అని హైదర్ వెల్లడించాడు.

నవంబరు 9, 2010న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన హైదర్.. ఆ తర్వాత ఏడాదిగానీ పాకిస్థాన్ గడ్డపై మళ్లీ అడుగుపెట్టలేదు. తాజాగా ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం తనని పెద్దగా ఆశ్చర్యపరచలేదని చెప్పుకొచ్చిన ఈ మాజీ వికెట్ కీపర్.. జీవితకాలం నిషేధం విధించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *