కుల వివక్ష వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్భారత మాజీ ఆల్‌రౌండర్ ఎట్టకేలకి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన యువరాజ్ సింగ్.. స్పిన్నర్ చాహల్‌ ఫన్నీ టిక్‌టాక్ వీడియోల గురించి ప్రస్తావిస్తూ.. ఈ భాంగీ మనుషులకి ఏం పని ఉండదు అని వ్యాఖ్యానించాడు. దాంతో యువీ వ్యాఖ్యలు దళితుల్ని కించపరిచేలా ఉన్నాయని.. దళిత హక్కుల కార్యకర్త, అడ్వకేట్ రజత్ కల్సన్.. హర్యానాలోని హన్సి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులో యువరాజ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరడంతో పాటు.. క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు.

భాంగీ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో యువరాజ్ సింగ్ తాజాగా ట్విట్టర్‌లో స్పందించాడు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్న యువరాజ్.. ఆ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరాడు. తాను ఎప్పుడూ అందరికీ గౌరవం ఇవ్వాలని భావించే వ్యక్తినని చెప్పుకొచ్చిన ఈ మాజీ ఆల్‌రౌండర్.. ఓ బాధ్యతాయుత పౌరుడిగా దేశం, ప్రజలపై ప్రేమ ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు.

2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. వరల్డ్‌కప్‌ల హీరోగా అప్పట్లో అభిమానుల నుంచి కితాబు అందుకున్నాడు. కానీ.. 2014లో టీ20 ప్రపంచకప్ నుంచి అతని కెరీర్ గాడి తప్పింది. క్రమంగా భారత్ జట్టుకి దూరమైన యువీ.. వీడ్కోలు మ్యాచ్ కూడా ఆడకుండానే 2019లో రిటైర్మెంట్ ప్రకటించేశాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *