గుడ్ న్యూస్.. 2 నెలలు ఉచితంగానే రేషన్ సరుకులు!



కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా బుధవారం పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఎంఎస్ఎంఈలు, ఈపీఎఫ్, డిస్కమ్స్, క్రాంటాక్టర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ట్యాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు అంశాలకు సంబంధించి పలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి నిర్మలమ్మ మీడియాతో మాట్లాడుతున్నారు.

వలస కార్మికులకు ఉచితంగానే వచ్చే 2 నెలలపాటు రేషన్ అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే.. వారికి కూడా 5 కేజీల గోధుమలు అందిస్తామని పేర్కొన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్నారు. తాజా నిర్ణయం వల్ల 8 కోట్ల మంది వలస కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కేంద్రం రూ.3,500 కోట్లు భరిస్తుందని పేర్కొన్నారు. మార్చి 2021 నాటికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.

Also Read:

అలాగే ఈసారి స్ట్రీట్ వెండర్స్‌కు సంబంధించి ఒక నిర్ణయం, హౌసింగ్‌కు సంబంధించి మరో నిర్ణయం, రైతులకు సంబంధించి 2 నిర్ణయాలు, ట్రైబల్స్‌కు సంబంధించి 1 నిర్ణయం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి సంబంధించి ఒక నిర్ణయం ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. వలస కార్మికులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు మొత్తంగా 9 రకాల చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు.

Also Read:

కచ్చితంగా తీసుకున్న లోన్స్‌ను తిరిగి చెల్లిస్తున్న రైతులకు వడ్డీ తగ్గింపుతో అందించే రుణాలను మే 31 వరకు పొడిగిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దాదాపు 3 కోట్ల మంది సన్నకారు రైతులు రూ.4 లక్షల కోట్ల రుణాలు పొందారని పేర్కొన్నారు. వీరికి కూడా ఆర్‌బీఐ ఈఎంఐ మారటోరియం సదుపాయం వర్తిస్తుందని మరోసారి గుర్తు చేశారు. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు దారులు రూ.25 వేల కోట్ల రుణాలు పొందారని తెలిపారు.

అలాగే పట్టణాల్లోని పేదలు, వలసదారులకు రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎస్‌డీఆర్ఎఫ్ కింద ఆహారం అందిస్తున్నామని తెలిపారు. షెల్టర్ హోమ్స్‌లో రోజుకు మూడు పూటల అన్నం పెడుతున్నామని పేర్కొన్నారు. ఇక మార్చి 15 నుంచి చూస్తే పట్టణాల్లో కొత్తగా 7,200 స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read:

పట్టణాల నుంచి తిరిగి సొంతూర్లకు వెళ్లిపోయే వారికి ఉపాధి కల్పిస్తున్నామని నిర్మలమ్మ తెలిపారు. 1.87 గ్రామ పంచాయితీల్లో 2.33 కోట్ల మందిని నమోదు చేసుకున్నామని, వీరికి ఎంఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి కల్పిస్తామని, దీని కోసం రూ.10,000 కోట్ల నిధులు కేటాయిస్తామని వివరించారు. వ్యవసాయ రంగంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో 63 లక్షల రుణాలు (రూ.86 వేల కోట్లు) అందించామని తెలిపారు. నాబార్డు మార్చి నెలలో రూ.29,500 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసిందని పేర్కొన్నారు.

కార్మిక చట్టాలను సవరిస్తున్నామని, వర్కర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కనీస వేతనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అపాయింట్‌మెంట్ లెటర్లు, హెల్త్ చెకప్స్ వంటివి కచ్చితంగా ఉండేలా చూస్తామని తెలిపారు. ఈఎస్ఐసీ స్కీమ్ బెనిఫిట్స్‌ను మరింత మందికి చేరేలా చూస్తామన్నారు. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు కూడా దీన్ని వర్తింజేస్తామని తెలిపారు. అలాగే 10 లేదా అంతకన్నా తక్కువ మంది ఉద్యోగులకు కూడా స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌ను అందుబాటులో ఉంచుతామని వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *