జగన్‌కు కొత్త కష్టాలు.. సొంత పార్టీ నేతలతో తలనొప్పులు – ys jagan facing new problems with ysrcp mlas comments on govt policies


ముఖ్యమంత్రిగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. వినూత్నమైన సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్నారు. ఇచ్చిన హామీల్లో 90శాతం పూర్తి చేశామని చెబుతున్న సీఎం.. రాబోయే రోజుల్లోనూ ప్రజలకు మేలు చేస్తాం అంటున్నారు. ఏడాది పాలనపై మేధో మథనం కూడా నిర్వహించారు. పాలన సంగతి అలా ఉంటే.. పార్టీ పరంగా జగన్‌కు తలనొప్పులు మొదలయ్యాయి.. సొంత పార్టీ నేతల నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని.. తామూ ఏం చేయలేకపోతున్నామంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం తలనొప్పిగా మారింది. ఇసుక మాఫియా, ఇళ్ల స్థలాలతో పాటూ నియోజకవర్గాల్లో సమస్యలు తప్పడం లేదంటూ వరుసగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, బ్రహ్మనాయుడు, మానుగుంట మహీధర్ రెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఆనం సంచలన వ్యాఖ్యలు

samayam telugu

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తన నియోజకవర్గంలో ఏ పనీ చేయలేకపోతున్నానని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బహిరంగంగానే మాట్లాడారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి పని చేయలేదని వెంకటగిరిని రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, పాలకులు మరచిపోయారా అంటూ విరుచుకుపడ్డారు. తన మీద కక్షకట్టి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన సిఫార్సులకు దిక్కులేదని.. తాగునీరు సహా అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు ఏమైపోయాయో తెలియడం లేదన్నారు. నీళ్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.. జల దోపిడీ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మానుగుంట మహీధర్ రెడ్డిది అదే దారి

samayam telugu

ఆనం మాత్రమే కాదు ఇటీవల ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో సమస్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒంగోలు జడ్పీ ఆఫీ‌స్‌లో బైఠాయించడం చర్చనీయాంశమైంది. కందుకూరు నియోజవర్గానికి సంబంధించిన సమస్యలపై సీఈవో కైలాస్‌ గిరీశ్వర్‌తో చర్చించేందుకు వెళ్లారు. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు ఇతర బిల్లుల చెల్లింపు విషయమై సీఈవోను ప్రశ్నించారు. సీఎం జగన్ ఆశయాలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని.. అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ సమస్యలు తీర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందా? మిగతా ప్రాంతాల్లోనూ ఇలానే చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక మాఫియాపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఫైర్

samayam telugu

అంతేకాదు ఇసుక మాఫియా గురించి వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు చెప్పే వాటికి క్షేత్రస్థాయిలో జరిగే వాటికి పొంతన లేదని.. అమరావతిలో బయలుదేరిన ఇసుక లారీలు ఎటుపోతున్నాయని బ్రహ్మనాయుడు మంత్రుల ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు- నేడు పనులకు కూడా ఇసుక లేదని.. ప్రస్తుత ఇసుక విధానంతో సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని మరో ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యానించారట. ఇక కోటంరెడ్డి కూడా గతంలో ఇసుక మాఫియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరును తప్పుబట్టారు.. తానే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి.

ఇళ్ల స్థలాలు, ఇసుక మాఫియాపై ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

samayam telugu

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇళ్ల స్థలాలు, ఇసుక మాఫియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల పట్టాల మంజూరుకు డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను అన్నారు.. ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఇసుక విషయంలో లోపాలు ఉన్నాయని ఎంపీ అన్నారు. ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వెయ్యి కోట్ల రూపాయలకు మించదని.. దీనికోసం చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు అన్నారు. పారదర్శకత అంటున్నారు.. కానీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రయత్నిస్తే కంప్యూటర్లు పనిచేయవన్నారు. తన ఏరియాలోరీచ్‌ ఉంది.. కానీ అక్కడ తవ్విన ఇసుకను స్టాక్‌ పాయింట్లకు చేర్చకుండా కొందరు ఇతర మార్గాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. మధ్యలో దళారులు తినేస్తున్నారని ఇసుక సజావుగా సాగుతోందని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని.. కానీ పార్టీకీ చాలా చెడ్డపేరు వస్తోందన్నారు.

జగన్ ఎలా డీల్ చేస్తారు

samayam telugu

ఇలా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధినేత జగన్‌ను ఇరుకున పెడుతున్నాయని చెప్పాలి. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తమ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించడం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇలా నేతలు ఒక్కోక్కరుగా బయటకు రావడం ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది. ఇదేనా ఏడాది పాలన అంటూ సెటైర్లు మొదలయ్యాయి. అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందా.. సమన్వయం లోపమా కూడా అర్ధంకాని పరిస్థితులు ఉన్నాయి. అధికారులతో ప్రజా ప్రతినిధులు సమన్వయ లోపంతోనే ఇలా జరుగుతుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి జగన్ దీన్ని ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నేతల్ని పిలిచి బుజ్జగిస్తారా.. ఆ బాధ్యతల్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు అప్పగిస్తారా అన్నది చూడాలి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *