ప్లీజ్ హెడెన్ ఆ ముంగూస్ బ్యాట్‌ని వాడొద్దు.. ధోనీ రిక్వెస్ట్



ఐపీఎల్ 2010 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఆ టీమ్ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ని ఓ బ్యాట్‌ విషయంలో చాలా రిక్వెస్ట్ చేశాడట. ఆ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్‌లో చిత్రమైన ‘‘ముంగూస్ బ్యాట్‌’’తో బరిలోకి దిగిన మాథ్యూ హెడెన్ కేవలం 43 బంతుల్లోనే 9×4, 7×6 సాయంతో ఏకంగా 93 పరుగులు చేశాడు. దాంతో.. 186 పరుగుల లక్ష్యాన్ని చెన్నై అలవోకగా ఛేదించి విజయం సాధించినా.. ధోనీ మాత్రం ఇకపై ఆ బ్యాట్‌ వాడొద్దని హెడెన్‌కి సూచించాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెడెన్‌ బహిర్గతం చేశాడు.

పొడవైన హ్యాండిల్ కలిగిన ఆ ముంగూస్ బ్యాట్‌‌‌.. అప్పట్లో అందరినీ అమితంగా ఆకర్షించింది. కానీ.. స్ట్రైకింగ్ సర్పేస్ తక్కువగా ఉండటంతో.. బంతిని ఆశించిన మేర దూరంగా హిట్ చేయలేరని క్రికెట్ విశ్లేషకులు పెదవి విరిచారు. కానీ.. హెడెన్ మాత్రం ఆ మ్యాచ్‌లో అలవోకగా ఆ బ్యాట్‌తో ఏడు సిక్సర్లు బాదేశాడు. అయితే.. నిబంధనలకి విరుద్ధంగా ఆ బ్యాట్ ఉందని కొందరు విమర్శించడంతో కెప్టెన్ ధోనీ స్వయంగా రంగంగలోకి దిగి.. ఇకపై ఆ బ్యాట్ వాడొద్దని హెడెన్‌కి సూచించాడట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? సురేశ్ రైనా ఆ మ్యాచ్‌లో హెడెన్ ఇన్నింగ్స్‌కి ముగ్ధుడై.. ఆ ముంగూస్ బ్యాట్‌‌ మీద హెడెన్ సైన్ తీసుకుని మరీ తన గుర్తుగా దాచుకున్నాడట.

ముంగూస్ బ్యాట్‌‌ వాడొద్దని ధోనీ చెప్పడంపై హెడెన్ మాట్లాడుతూ ‘‘నీకు ఏం కావాలన్నా ఇస్తాను. కానీ.. ఆ ముంగూస్ బ్యాట్‌‌ని మాత్రం దయచేసి వాడొద్దు అని ధోనీ రిక్వెస్ట్ చేశాడు. వాస్తవానికి నేను దాదాపు ఏడాదన్నరపాటు ఆ ముంగూస్ బ్యాట్‌‌‌తోనే నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాను. బంతిని ఆ బ్యాట్‌తో కరెక్ట్‌గా మిడిల్ చేయగలిగితే కనీసం 20 మీటర్ల దూరం అది వెళ్తుంది. కానీ.. ధోనీ సూచన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని రిస్క్‌లో పెట్టే‌లా నా బ్యాటింగ్ ప్రదర్శన ఉండకూడదని నిర్ణయించుకున్నా. నిజానికి ఆ బ్యాట్‌తో మ్యాచ్‌లో ఆడాలనేది ఓ సాహసోపేత నిర్ణయం. బ్యాటింగ్‌ని కూడా నేను బాగా ఎంజాయ్ చేశా.. ఇంకా చెప్పాలంటే చాలా సరదాగా కూడా అనిపించింది’’ అని హెడెన్ వెల్లడించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *