భారత‌‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. చైనాపై అమెరికా సంచలన వ్యాఖ్యలుగాల్వన్ లోయలో భారత సైన్యంపై దాడి చేసిన నేపథ్యంలో.. డ్రాగన్‌పై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొరుగు దేశాలతో చైనా దుర్మార్గంగా (రోగ్) వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశమైన భారత్ సరిహద్దుల్లో చైనా సైన్యం ఉద్రిక్తతలను పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘దక్షిణ చైనా సముద్రంలో సైన్యాన్ని మోహరిస్తోంది.. అక్రమంగా ఆ ప్రాంతం తనదని వాదిస్తోంది.. సముద్ర మార్గాలను బెదిరిస్తోంది’ అని పాంపేయో వ్యాఖ్యానించారు.

డెన్మార్ రాజధాని కొపెన్‌హగన్‌లో ప్రజాస్వామ్యంపై జరిగిన ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంపేయో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశాలు, స్వేచ్ఛను ప్రేమించే వారంతా చైనాను ఎదుర్కోవడానికి కలిసి రావాలని అమెరికా విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు.

చైనా కమ్యూనిస్టు పార్టీతోపాటు.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను లక్ష్యంగా చేసుకొని కూడా పాంపేయో విమర్శలు గుప్పించడం గమనార్హం. చైనీస్ ముస్లింలను అణచివేయడానికి జిన్‌పింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఇంతటి మానవ హక్కుల ఉల్లంఘనను రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటి వరకూ చూడలేదని అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు చైనా భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోందన్నారు.

అంతకు ముందు రోజే గాల్వన్ ఘర్షణల్లో చనిపోయిన 20 మంది భారత సైనికులకు పాంపేయో నివాళులు అర్పించారు. అమెరికా, యూరప్ మధ్య చీలిక తెచ్చేలా చైనా ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజింగ్‌కు ఉపకరించేలా కొత్త నిబంధనలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకొస్తోందన్నారు.

కరోనా వైరస్‌పై చైనా అబద్ధాలు చెప్పిందని, మిగతా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలా చేసింది.. దానికి సహకరించేలా డబ్ల్యూహెచ్‌వోపై ఒత్తిడి తీసుకొచ్చిందని పాంపేయో ఆరోపించారు. చైనా చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని పాంపేయో చెప్పారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *