50 లక్షలకు చేరువలో కరోనా కేసులు..రష్యా కొంపముంచిన అలసత్వంప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అటు ఐరోపా దేశాల్లోనూ పరిస్థితి కుదుటపడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా వైరస్ సోకతున్నవారి సంఖ్య కూడా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ వైరస్ సోకినవారి సంఖ్య 50 లక్షలు చేరవవుతోంది. వీరిలో 3.25 లక్షల మంది చనిపోయారు. మరో 19.60 లక్షల మంది కోలుకోగా.. ఇంకా దాదాపు 27 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 46వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.

కాగా, మహమ్మారి దెబ్బకు రష్యా చిగురుటాకులా వణుకుతోంది. తొలిసారి చైనాలో కరోనా విజృంభించగా.. తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలను అతలాకుతలం చేసింది. అక్కడ వైరస్‌ విస్తృతంగా వ్యాపించినప్పుడు రష్యాలో మాత్రం అతి తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ప్రభుత్వం అలసత్వం వహించింది. దీనికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటి వరకూ రష్యాలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువయ్యింది. అమెరికా తర్వాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. అయితే, మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. మొత్తం 2,837 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో రష్యా కొంతమేరకు సురక్షితంగానే కనిపించింది. జనవరి 30నే చైనాతో సరిహద్దులను మూసేసి, దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణికుణ్ని పరీక్షించాలని పుతిన్ ఆదేశించారు. అయితే… క్షేత్రస్థాయిలో అటు అధికారులు, ఇటు ప్రజలు సమస్య తీవ్రతను పట్టించుకోలేదు.

వైరస్ ఎక్కువగా ఉన్న ఇటలీ, ఫ్రాన్స్‌ లాంటి దేశాల నుంచి వచ్చే వారినీ సరిగ్గా పరీక్షించకుండానే వదిలేశారు. లాక్‌డౌన్‌ విధించినా ప్రజలు వీధుల్లోనే గుమిగూడటంతో ప్రస్తుతం అక్కడ రోజుకు సగటున 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో సగం దేశ రాజధానిలోనే ఉంటున్నాయి. మొదట్లో మాస్కోలోనే కేంద్రీకృతమైన వైరస్‌… ప్రస్తుతం దేశమంతటా వ్యాపిస్తోంది.

అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 15.70 లక్షలు దాటగా.. ఇప్పటి వరకూ 93,533 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల దాటిన దేశాల సంఖ్య ఆరు దాటింది. లక్షకుపైగా పాజిటివ్ కేసుల నమోదయిన దేశాల సంఖ్య 11గా ఉంది. స్పెయిన్‌లో 278,803, బ్రెజిల్ 271,885, బ్రిటన్ 248,818, ఇటలీ 226,699, ఫ్రాన్స్ 180,809, జర్మనీ 177,827, టర్కీ 151,615, ఇరాన్ 124,603 కేసులు నమోదయ్యాయి.

అమెరికా తర్వాత అత్యధికంగా ఐరోపా దేశాల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. యూకేలో కరోనా మరణాల సంఖ్య 35,341కి చేరగా.. ఇటలీలో 32,169గా నమోదయ్యింది. ఫ్రాన్స్ 28,022, స్పెయిన్ 27,778, బ్రెజిల్ 17,983 మంది, బెల్జియం 9,108, జర్మనీ 8,193, ఇరాన్ 7,119, కెనడా 5,912, నెదర్లాండ్ 5,715, మెక్సికో 5,666, చైనాా 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *