Auraiya accident: రాజస్థాన్ పోలీసులే బలవంతంగా లారీ ఎక్కించారు.. యూపీ ప్రమాద బాధితులు ఆరోపణ – rajasthan cops forced us into truck, allege uttar pradesh auraiya crash survivors


శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మంది వలస కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి వలస కూలీలతో వస్తున్న ఓ ట్రక్ ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు తమను బలవంతంగా సున్నం బస్తాల లారీలో ఎక్కించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన గుడ్డు అనే వలస కార్మికుడు మాట్లాడుతూ… రాజస్థాన్‌లోని స్టోన్ మైన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని అన్నాడు.

మొత్తం 43 మంది కార్మికులం బయలుదేరామని, తమను బలవంతంగా సున్నం బస్తాలలోడుతో ఉన్న ట్రక్కులో ఎక్కించారని తెలిపాడు. భరత్‌పూర్‌కు చేరుకున్న తర్వాత రాజస్థాన్ పోలీసులు తమను అడ్డుకున్నారని, కాళ్లావేళ్లా బతిమిలాడటంతో చివరకు ఒప్పుకున్నారన్నాడు. అయితే, బస్సులో వెళ్లేందుకు ఒప్పుకోలేదని, బలవంతగా లోడుతో ఉన్న ట్రక్‌లో ఎక్కించి రాష్ట్రం సరిహద్దులు దాటించారని ఆరోపించాడు. బాధితుల వాంగ్మూలం నమోదుచేశామని, ఈ ఆరోపణలు రుజువైతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ అన్నారు.

ప్రమాదానికి గురైన వాహనా డ్రైవర్లు, యజమానులపై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదుచేసినట్టు ఔరయా ఎస్పీ సునిటి వెల్లడించారు. కాగా, వలస కూలీలు చేస్తున్న ఆరోపణలు రాజస్థాన్ పోలీసులు ఖండించారు. వలస కార్మికులను సరిహద్దులు దాటించడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రమాదానికి గురైన బాధితులను కూడా భరత్‌పూర్-యూపీ సరిహద్దులకు బస్సులోనే చేర్చామన్నారు.

నిబంధనల ప్రకారం ట్రక్కుల్లో ప్రయాణించడానికి ఎవర్నీ అనుమతించడంలేదని స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి వస్తున్న వలస కూలీల ఒక్కొక్కరి నుంచి ట్రక్ డ్రైవర్లు రూ.2,000 వసూలు చేశారని, మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వాహనంలో ప్రయాణిస్తున్నవారి నుంచి మనిషికి రూ.1,500 వసూలుచేశారని ఔరయా ఎస్పీ తెలిపారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *