BJP manifesto: 19 లక్షల ఉద్యోగాలు, ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్: నిర్మలా సీతారామన్ – bihar: bjp promises 19 lakh jobs, free covid vaccination in manifesto


బిహార్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ ప్రకటించగా.. బీజేపీ మరో అడుగు ముందుకేసి దానికి దాదాపు ‘డబుల్’ ప్రకటన చేసింది. ఎన్డీయే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు, రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు 30 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టి ఇస్తామని, 9 తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఉచిత ట్యాబ్లెట్‌ అందజేస్తామని ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం (అక్టోబర్ 22) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గత 15 ఏళ్లలో బిహార్‌లో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

మోసపూరితమైన హామీలను నమ్మకుండా ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని నిర్మల సీతారామన్ కోరారు. నితీశ్‌ కుమార్‌ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న కీలక అంశాలు
✧ కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేయిస్తాం.
✧ రాష్ట్రంలో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం
✧ బిహార్‌ను ఐటీ హబ్‌గా తయారు చేస్తాం. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.
✧ ఆరోగ్య రంగంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.
✧ 30 లక్షల కుటుంబాలకు పక్కా గృహాలు మంజూరు చేస్తాం.
✧ 9 తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఉచితంగా ట్యాబ్లెట్‌ అందిస్తాం.
✧ 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తాం.

ఇప్పుడెలా సమర్థించుకుంటారో..!
ఇక్కడ 19 లక్షల ఉద్యోగాల గురించి కీలకంగా మాట్లాడుకోవాలి. విపక్షాల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించగా.. అధికార పక్షం తీవ్రమైన విమర్శలు చేసింది. అంత మంది ఉద్యోగులకు జీతాలు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారో కూడా చెప్పాలని సీఎం నితీశ్ కుమార్ నిలదీశారు. ఈ అంశంపై తేజస్వి యాదవ్‌, ముఖ్యమంత్రి నితీశ్‌ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది.

అనుభవం ఉన్నప్పటికీ సీఎం నితీశ్ ఇంకా పాత కాలం మనిషిలానే ఆలోచిస్తున్నారని తేజస్వి విమర్శించారు. అనుభవలేమితో తేజస్వి యాదవ్ నోటికొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని నితీశ్‌ మండిపడ్డారు. ఆర్జేడీ మేనిఫెస్టోలో ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు సాధ్యపడే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై చర్చ కొనసాగుతుండగానే జేడీయూ మిత్ర పక్షం బీజేపీ 19 లక్షల ఉద్యోగాలు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రకటన నేపథ్యంలో విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు ఎదురవుతాయో వేచి చూడాలి.

బిహార్‌లో 243 శాసనసభ స్థానాలకు గాను మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. అక్టోబరు 28న మొదటి విడత పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం వేడెక్కింది.

Also Read:

వణికిస్తున్న చలి.. ముసుగేసిన ఢిల్లీ

లాక్‌డౌన్ కారణంగానే వానల బీభత్సం..!Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *