boris jonson: నా మరణవార్తను ఎలా బయటకు చెప్పాలో డాక్టర్లు సిద్ధమయ్యారు.. బ్రిటన్ ప్రధాని – britain pm boris johnson reveals doctor’s prepared to announce his death during treatment


కరోనా వైరస్‌ బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఇంటి వద్ద చికిత్స తీసుకున్నా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో తర్వాత ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు జాన్సన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. ఈ సమయంలో తాను దురదృష్టవశాత్తూ చనిపోతే ఆ వార్తను బయటి ప్రపంచానికి ఎలా తెలియజేయాలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారని ‘ది సన్’పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్సన్ సంచలన విషయం వెల్లడించారు. ఆస్పత్రిలో అతి కష్టంగా గడిచిన రోజుల్ని గుర్తుచేసుకున్న బోరిస్ జాన్సన్.. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లివచ్చినట్లు తెలిపారు.

‘తనకు లీటర్ల కొద్దీ ఆక్సిజన్‌ ఖర్చుచేస్తున్నారు.. అయినా, లో ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి.. పరిస్థితులు చేదాటిపోతే ఆ విషయాన్ని ఎలా బయటకు చెప్పాలన్న ప్రణాళికలు వైద్యులు సిద్ధం చేసుకుంటున్నారు. అది నాకు అర్థమవుతూనే ఉంది. అవన్నీ చేదు జ్ఞాపకాలు’ అంటూ గద్గద స్వరంతో బోరిస్‌ నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.

‘కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం అంతలా ఎలా క్షీణించిందో అంతుబట్టలేదు. అంతా చికాకుగా అనిపించింది. ఎందుకు కోలుకోలేకపోతున్నానో నాకే అర్థం కాలేదు. ఇక నా వాయునాళంలో ప్రత్యేక ట్యూబ్‌ అమర్చుదామా.. అనే వరకు వెళ్లింది. ఇక అప్పుడు పరిస్థితి చేదాటిపోతే ఎలా అని వైద్యుల ఆలోచించడం ప్రారంభించారు.. ఇప్పుడు నేను ఉద్వేగానికి లోనవుతున్నాను. కానీ, అలాంటి పరిస్థితుల నుంచి కూడా నన్ను తిరిగి మామూలువాణ్ని చేసిన ఘనత వైద్యులకే దక్కుతుంది.

వారి వైద్యం ఓ అద్బుతం.. ఆస్పత్రిలో నాపై తీసుకున్న శ్రద్ధ మాటల్లో చెప్పలేనిది. అద్భుతంగా పనిచేసిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ని’ అంటూ వైద్యులు సేవల్ని కొనియాడారు. చికిత్సలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వైద్యులకు గుర్తుగా.. తన కుమారుడికి వారి పేరుతో నామకరణం చేసిన విషయం తెలిసిందే.

‘గతంలో అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యాను కానీ, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. అంతా గందరగోళంగా అనిపించింది. ఆస్పత్రికి చాలా మంది వస్తున్నారు. కోలుకొని వెళ్లిపోతున్నారు. నేను మాత్రం ఎందుకు కోలుకోలేకపోతున్నానో అర్థమయ్యేది కాదు. దీనికి చికిత్స లేదు. ఇప్పుడు దీన్నుంచి ఎలా బయటపడేది అని ఆలోచిస్తూ ఉండేవాణ్ని. అయినా, త్వరలో అంతా సర్దుకుపోతుందని నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని’ అని చికిత్స సమయంలో సడలని తన విశ్వాసాన్ని బోరిస్‌ వివరించారు.

నేను అదృష్టవంతుడ్ని.. చాలా మంది వైరస్‌తో ఇంకా బాధపడుతున్నారు.. నన్ను అడిగితే వారు త్వరగా కోలుకుని ఉపశమనం కలగాలని కోరుకుంటానని అన్నారు. ‘కానీ నేను కూడా మన దేశాన్ని పూర్తిగా సాధారణ స్థితికి తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని.. దానిని చేరుకుంటానని తనకు నమ్మకం ఉందని’అన్నారు.

కరోనా వైరస్‌ బారినపడి ఆరోగ్యపరంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొన్న బోరిస్‌ జాన్సన్‌లో చాలా మార్పు వచ్చిందని ఇంటర్వ్యూ చేసిన డేవిడ్‌ వూడింగ్‌ తెలిపారు. చాలా ఏళ్లుగా నేను బోరిస్‌ను కలుస్తున్నానని, అనేక సార్లు ఇంటర్వ్యూ చేశాను కానీ, ఈసారి చేసింది వాటన్నికంటే చాలా ప్రత్యేకమైందన్నారు. నిబంధనల మేరకు ఇంటర్వ్యూ సమయంలో సామాజిక దూరం పాటించినప్పటికీ.. మృత్యువుతో పోరాడిన ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడిందని వ్యాఖ్యానించారు. గతవారమే జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యారు.

కరోనాకు చికిత్స చేసిన డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్టు తెలిపారు. ప్రాణంపోసిన వైద్యుల పేరును తమ కుమారుడికి పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీమండ్స్ తాత లౌరీ.. బోరిస్ తాత విల్‌ఫ్రెడ్.. జాన్సన్‌కు వైద్యం చేసి డాక్టర్లు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు. ‘తనను చాలా బాగా చూసుకున్న జాతీయ ఆరోగ్య వ్యవస్థ ప్రసూతి బృందానికి ధన్యవాదాలు.. సంతోషంతో నా గుండె నిండింది’ అని ప్రధాని భార్య తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పెట్టారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *