China coronavirus: చైనాకు మరోసారి కరోనా ముప్పు.. ఆందోళనకర లక్షణాలు – china vulnerable to another covid-19 wave due to lack of immunity, warns top health advisor


చైనాలో కొవిడ్-19 మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా మహమ్మారికి జన్మస్థానమైన ఈ దేశంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఊరట చెందుతున్న దశలో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. చైనాకు మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ప్రభుత్వ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ జోంగ్ నాన్సన్ ఈ హెచ్చరికలు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. శనివారం (మే 16) ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఛానెల్ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ ఆయన కీలక వివరాలు వెల్లడించారు.

చైనీయుల్లో వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా అక్కడ కొవిడ్-19 మరోసారి విజృభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చైనాలో గత కొన్ని రోజులుగా మళ్లీ కేసులు పెరుగుతుండటం ఈ వాదనకు ఊతమిస్తోంది. కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌ ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. కొన్ని వారాలుగా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది.

చైనాలో కొత్తగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో లక్షణాలు కూడా బయటపడకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో చైనా ముందు అతిపెద్ద సవాల్‌‌ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాలతో పోలిస్తే దీని తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. చైనాలో రెండోసారి ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో అధికారులు ఉదాసీనంగా ఉండకూడదని డాక్టర్ జోంగ్ హెచ్చరించారు.

2003లో చైనాలో సార్స్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో వ్యాధిని ఎదుర్కొనేందుకు డాక్టర్ జోంగ్‌ విశేష కృషి చేశారు. దీంతో ఆయణ్ని ‘సార్స్‌ హీరో’గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ పోరులో భాగంగా చైనా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొవిడ్‌-19 మనుషుల మధ్య సంక్రమిస్తుందని తొలిసారిగా ప్రకటించింది ఆయనే కావడం గమనార్హం. ఈ ఏడాద జనవరిలో చైనా అధికారిక మీడియాలో ఆయన ఈ హెచ్చరిక చేశారు.

Also Read:లెప్రసీ డ్రగ్‌తో ఆశాజనక ఫలితాలు.. ఎయిమ్స్ గుడ్ న్యూస్

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తొలి రోజుల్లో అధికారులు దీనికి సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదని జోంగ్ చెప్పడం గమనార్హం. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రతను చాలా తక్కువగా చూపించారని ఆయన పేర్కొన్నారు. పక్కా సమాచారంపై అధికారులను మళ్లీ ప్రశ్నించగా నమ్మశక్యంకాని సమాచారాన్ని అందజేశారని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచానికి సరైన సమాచారం ఇవ్వకుండా చైనా తప్పు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ జోంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చైనాలో కరోనా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్న ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, రైళ్లు, బస్సులు, విమాన సేవలను ప్రారంభించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో కొత్తగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ సోకిన వారిని గుర్తించడానికి చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. వుహాన్‌లో ఇలాంటి పరీక్షా కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించట్లేదని.. ఇది ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Must Read:వైద్యులు, నర్సుల మరణాలు అందంగా ఉన్నాయి.. ట్రంప్ నోటి దురుసుSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *