coronavirus cases in america : అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, 2 వేలకు చేరువలో మరణాలు, కారణాలివే.. – coronavirus cases in us crosses 1,15,000; death toll rises 1929, here is some reasons


రోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం అమెరికా కూడా విలవిలలాడుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదయ్యాయి. ఇప్పటికే ఆ దేశంలో పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే వణుకుతున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 1929 మరణాలు చోటు చేసుకున్నాయి. శనివారం (మార్చి 28) నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,842కి పెరిగింది.


రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. కరోనా వైరస్ పుట్టిన చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు లక్ష మార్క్‌ దాటడానికి డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరే ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.

అమెరికాలో కరోనా పంజా విసరడానికి కారణాలివే..

అమెరికాలో మొట్టమొదటి కరోనా కేసు జనవరి చివరి వారంలో నమోదైంది. అప్పుడే మేల్కొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని విశ్లేషకుల అంచనా. కేవలం చైనా నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించిన డొనాల్డ్ ట్రంప్.. మిగిలిన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించారు. అదే కొంపముంచింది.

ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల నుంచి అమెరికాకు వేలాది మంది తిరిగొచ్చారు. అక్కడ నుంచి వైరస్ వ్యాపించింది. ఫిబ్రవరి 29న దేశంలో తొలి మరణం చోటు చేసుకుంది. అప్పటికి కూడా ట్రంప్ కళ్లు తెరవలేదు. లాక్‌డౌన్ విధించడంపై మొండివైఖరి ప్రదర్శించారు. అధికారుల సూచనలు కూడా పెడచెవిన పెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్థం చేసుకునే సరికే పరిస్థితి చేజారిపోయింది.

చూస్తుండగానే అమెరికాలో జనసాంద్రత అధికంగా ఉండే న్యూయార్క్ రాష్ట్రానికి కరోనా సోకింది. అక్కడ కేసులు అనూహ్యంగా పెరిగాయి. 50 వేలకు పైగా కేసులు ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం. 500 మరణాలు కూడా ఇక్కడే సంభవించాయి. క్రమంగా పక్కనే ఉండే న్యూజెర్సీ తదితర రాష్ట్రాలకు వైరస్ పాకింది.

పరిస్థితి విషమించడంతో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఆ ప్రతికూల ప్రభావ తీవ్రత నుంచి సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చేలా 2 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. చట్టరూపంలోకి తెచ్చిన ఈ చరిత్రాత్మక ఫైల్‌పై శుక్రవారం సంతకం చేశారు. దీంతో అమెరికాలో ఒక్కో కుటుంబానికి దాదాపు 3400 డాలర్లు అందనున్నాయి. న్యూయార్క్ నగరవాసులను క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

ఆర్థిక ఉద్దీపన పథకంతో పాటు కరోనా కట్టడికి ట్రంప్ కీలక చర్యలు చేపట్టారు. డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అమెరికాలో చివరి అస్త్రాల్లో ఇదొకటి కావడం చర్చనీయాంశంగా మారింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సైన్యంలోని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అరుదుగా ప్రయోగించే ఈ చట్టం ద్వారా ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్‌ను పెద్ద ఎత్తున వెంటిలేటర్లు తయారీ చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బందిని కాపాడుకునే చర్యల్లో కీలకమైన సూట్లు, ఇతర రక్షక కవచాల తయారీకి ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో అమెరికన్లతో పాటు వివిధ దేశాల వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *