Coronavirus In India: భారత్‌లో కరోనా ఇంకా విజృంభించలేదు, కానీ ముప్పు పొంచి ఉంది: డబ్ల్యూహెచ్ఓ – coronavirus not ‘exploded’ in india but risk remains says who expert


భారత్‌లో కరోనా వైరస్‌ అదుపులోనే ఉందని, విజృంభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. అయితే, ముప్పు తొలగిపోలేదని, లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపుల నేపథ్యంలో ఏ సమయంలోనైనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చవచ్చని హెచ్చరించింది. కేసుల సంఖ్య రెట్టింపు సమయం, సామూహిక వ్యాప్తిపై దృష్టి సారించి కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగకుండా కట్టడి చేయాలని సూచించారు.

భారత్‌లో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ.. వైరస్‌ విజృంభిస్తోందని మాత్రం ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి పడుతున్న సమయం మూడు వారాలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా తీవ్రత ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిలో వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు.

దక్షిణాసియాలోని భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సహా పలు దేశాల్లో కరోనా వ్యాప్తి విజృంభించే స్థాయిలో లేదన్న ఆయన.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో వైరస్‌ ఎప్పుడైనా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనా కట్టడికి భారత్ చేపట్టిన లాక్‌డౌన్‌ వంటి చర్యలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభావం చూపాయన్నారు. అయితే, క్రమంగా ఆంక్షలు సడలించడంతో వైరస్‌ విజృంభణ ముప్పును కొట్టిపారేయలేమని ర్యాన్ పేర్కొన్నారు. వలస కార్మికులు, పట్టణ ప్రాంతాల్లో అధిక జనసాంద్రత, ఉపాధి కోసం తప్పనిసరిగా రోజుకూలీకి వెళ్లాల్సి ఉండడం వంటి సమస్యలు భారత్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు అని వివరించారు.

130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో దాదాపు 2లక్షల కేసులు నిర్ధారణ కావడం ఆందోళన చెందాల్సిన అంశం కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య ఉన్న విభిన్న పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థలు కరోనా కట్టడిలో కీలకంగా మారతాయని ఆమె వివరించారు. అయితే, వైరస్ వృద్ధిరేటు, కేసుల డబ్లింగ్ సమయంపై దృష్టిసారించాలని అన్నారు. లాక్‌డౌన్‌ క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడి బాధ్యత పూర్తిగా ప్రజలపైనే ఉందని ఆయన సూచించారు.

మహమ్మారి ఎప్పుడైనా విరుచుకుపడి విలయం సృష్టించే ప్రమాదం ఉందని, మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దేశంలో అధిక జనసాంద్రత గల నగరాలు, చాలా తక్కువ సాంద్రత కలిగిన గ్రామీణ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ఆరోగ్య వ్యవస్థలు కోవిడ్ -19 నియంత్రణకు సవాళ్లను విసురుతున్నాయని అన్నారు.

ఆలోచనలో మార్పు రావాలని, మాస్క్‌లు ధరించడం వంటి కొన్ని పనులు విధిగా చేయాలని ప్రజలకు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నామని, హేతుబద్ధతను అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు. అనేక పట్టణ ప్రాంతాల్లో భౌతిక దూరాన్ని పాటించడంలేదని, ప్రజలు బయటికి వచ్చినప్పుడు, కార్యాలయాలు, ప్రజా రవాణా, విద్యా సంస్థలలో మాస్క్‌లు చాలా ముఖ్యం అని ఆమె నొక్కివక్కాణించారు.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,887 కొత్త కేసులు నమోదు కాగా.. మరో 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,36,657కి చేరింది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో ఇటలీను దాటేసి ఆరో స్థానానికి చేరింది. దేశంలో తొలి విడత 21 రోజుల లాక్‌డౌన్ మార్చి 25న ప్రారంభమయ్యింది. తర్వాత దానిని దశలవారిగా పొడిగిస్తూ, క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *