coronavirus in us jails: అమెరికా జైళ్లలోని 2 వేలకుపైగా ఖైదీలకు కరోనా.. బయటపడని లక్షణాలు – more than 2 thousand inmates infected coronavirus in us prisons


అమెరికాలోని పలు జైళ్లలో 2 వేల మందికిపైగా ఖైదీలకు కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యిందని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ వెల్లడించింది. కరోనా పరీక్షలు నిర్వహించిన 2700 మందిలో 2028 మంది వైరస్‌ బారిన పడ్డారని తెలిపింది. అమెరికాలో కరోనా రక్కసి విజృంభణ కొనసాగుతుండగా.. ఇప్పటికే 61 వేల మందికిపైగా మృతిచెందారు. బాధితుల సంఖ్య 10.64 లక్షలకు చేరింది. అదే సమయంలో అక్కడి జైళ్లలోనూ ఖైదీలు భారీగా వైరస్‌ బారినపడతున్నారు. దీంతో జైళ్లలో ఉన్న మొత్తం 1,50,000 ఖైదీల పరిస్థితిపై న్యాయవాదులు, చట్టసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే, బయటి కంటే జైళ్లలోనే పరిస్థితులు బాగున్నాయని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ పేర్కొంది.

ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ బారినపడ్డ ఖైదీల సమాచారం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఖైదీలెవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది, ఇటీవల మైఖేల్‌ అనే ఓ ఖైదీకి కరోనా వైరస్‌ సోకినా అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లి, పరిస్థితి విషమించి, చివరికి మైఖేల్‌ చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులను సంప్రదించారు. తమ తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయామని మైఖేల్‌ కుమారుడు ఫ్లెమింగ్‌ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వద్ద వాపోయాడు. తన తండ్రి మృతికి గల కారణం కూడా వార్తల్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు.

విపత్కర పరిస్థితుల్లోనూ వీలైనంత మేరకు బాగానే పనిచేస్తున్నామని, అలాగే సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నామని జైలు అధికారులు చెబుతున్నారు. బుధవారం నాటికి 31 మంది ఖైదీలు కరోనాతో మృతిచెందారు. మరోవైపు జైలు అధికారులు రోజూ సీడీసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీడీసీ బృందాలు కూడా అనేక జైళ్లను సందర్శించి కరోనా వైరస్‌ నివారణకు పలు సూచనలు చేశాయి. దీంతో ఆయా కారాగారాల్లో ఖైదీల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానుతులు ఎవరైనా ఉంటే వారిని ఐసోలేట్‌ చేస్తున్నారు. ఇక ఖైదీలకు సంబంధించి 20 వెంటిలేటర్లు సమకూర్చామని, 5 వేల టెస్టు కిట్లు, 20 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ మెషీన్లు అందుబాటులోకి తెచ్చామని బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ వెల్లడించింది.

మొత్తం 2,028 మంది వైరస్ బారినపడ్డా 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం ఆశ్చర్యకరమని ఓ అధికారి తెలిపారు. అర్కాన్సాస్, ఉత్తర కరోలినా, ఓహియో, వర్జీనియాలోని 3,277 మందిలో 96 శాతం మంది ఖైదీల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడలేదని అధికారులు వెల్లడించారు. దీనిని బట్టి అమెరికాలోని జైళ్లలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చిని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఎమెర్జెన్సీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీనా వెన్ వ్యాఖ్యానించారు. కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నా, పరీక్షలు, నిఘా లేకపోవడం వల్ల ప్రస్తుతం మనకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ మంది వైరస్ బారినపడ్డారని అన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *