coronavirus world updates : ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు దాటేసిన కరోనా కేసులు.. 53 వేలు దాటిన మృతులు – globally more than 1,000,000 are infected and over 53,000 have died due to coronavirus


ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. ఒక్క ఐరోపా ఖండంలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 200 దేశాలకు కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కరోనాను నుంచి ప్రజలను రక్షించేందుకు పలు దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. సగం దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటి వరకూ కొవిడ్‌-19 కారణంగా 187 దేశాల్లో 53 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.


ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షల మంది కరోనా వైరస్ నుంచి కోలుకోవడం శుభపరిణామం. మరో 7 లక్షల మందికిపైగా స్వల్ప లక్షణాలతో బాధపడుతుండగా.. 37 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక, కరోనా దెబ్బకు ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్‌లు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇటలీలో కరోనా మరణాలు ఆగడం లేదు. ఇటలీ, స్పెయిన్‌లలో రోజుకు సగటున 850 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటలీలోనే కోవిడ్ మరణాల సంఖ్య 13,915కు చేరుకోగా… గురువారం మరో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కరోనా వైరస్‌తో ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించలేదు. కొత్తగా దాదాపు 3,500 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 115,242కి చేరింది.

అమెరికాలో కరోనా విజృంభణ మామూలుగా లేదు. ప్రపంచంలో అత్యధికంగా 2.45 లక్షల కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. గురువారం ఒక్క రోజే దాదాపు 30వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదులో రికార్డులు కనుమరుగుతున్నాయి. అమెరికాలో ప్రజల పరిస్థితి దయానీయంగా ఉంది. న్యూయార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 6,000కు చేరుకోగా.. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పరీక్షలను దాదాపు 1.5 మిలియన్ల మందికి నిర్వహించారు.

వైరస్‌ తొలిసారి వెలుగుచూసిన చైనాలో వైరస్ తగ్గుముఖం పట్టింది. అయితే, చైనా మళ్లీ ఉలిక్కిపడింది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని జియా ప్రాంతంలో ఓ మహిళకు కరోనా సోకినట్టు తేలడంతో చైనా యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. సుమారు 6 లక్షల మంది ఉన్న ఆ ప్రాంతంలో గురువారం ఉన్నపళంగా లాక్‌డౌన్‌ విధించింది. ఎలుగుబంటి పైత్య రసాన్ని ఉపయోగించి కరోనా రోగులకు చికిత్స అందించేందుకు చైనా అధికారులు అనుమతినివ్వడం వివాదాస్పదమైంది. జంతువుల అక్రమ వ్యాపారాన్ని నిరోధించే ప్రక్రియకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అటు ఫ్రాన్స్‌లో అత్యంత దయనీయ పరిస్థితి నెలకొంది. మహమ్మారితో మృతిచెందిన వారి శవపేటికలను ఉంచేందుకు పారిస్‌లో చోటు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ పేటికలు గుట్టల్లా పేరుకుపోయాయని, భవిష్యత్తులో మరిన్ని రానున్నందున… గత్యంతరం లేని పరిస్థితుల్లో నగరంలోని భారీ ఫుడ్‌ మార్కెట్‌ రంజిస్‌లోని హాలును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు.

స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, నెదర్లాండ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మరణాల్లో స్పెయిన్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత ఈ దేశంలోనే అత్యధికంగా 10,348 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం అక్కడ ఏకంగా 1,000 మంది మృతిచెందగా, కొత్తగా మరో 9,000 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 1.12 లక్షలు దాటేసింది.

ఫ్రాన్స్‌, ఇరాన్, బ్రిటన్‌లోనూ కరోనా వైరస్ స్వైరవిహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 5,387 మందికిపైగా బలయ్యారు. బుధవారం అక్కడ మరో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,500 మందిలో వైరస్ నిర్ధారణ కాగా, మొత్తం కేసులు 59, 105 మందికి వైరస్ సోకింది. జర్మనీలో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నా, మరణాలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అక్కడ కరోనా కేసులు 84,981కు చేరాయి. చనిపోయిన వారి సంఖ్య 1,107కి చేరింది.

ఇరాన్‌లో బుధవారం 125 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం 3,160 మంది, బ్రిటన్‌లో దాదాపు 550 మంది చనిపోగా మరణాల సంఖ్య 2,921కు చేరింది. నెదర్లాండ్‌లో 1,339, మంది, స్విట్జర్లాండ్‌లో 536మంది, బెల్జియంలో 1,011 మంది చనిపోయారు. టర్కీలోనూ కోవిడ్ కేసులు 18,135కు చేరుకోగా, 356 మంది ప్రాణాలు కోల్పోయారు. దయ్యింది. పాకిస్థాన్‌ను కరోనా మరింత భయపెడుతోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాన్‌ పొరుగునే ఉండటం.. పాక్ షియా ముస్లింలు భారీ సంఖ్యలో ఇరాన్ వెళ్లి రావడంతో.. పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *