DC vs CSK Match Highlights: చెన్నైపై ‘శత’క్కొట్టిన శిఖర్ ధావన్.. ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపు – ipl 2020: delhi capitals beat chennai super kings by 5 wkts


ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో శతకం నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో షార్జా వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (101 నాటౌట్: 58 బంతుల్లో 14×4, 1×6) అజేయ శతకం బాదడం ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత డుప్లెసిస్ (58: 47 బంతుల్లో 6×4, 2×6), రవీంద్ర జడేజా (33 నాటౌట్: 13 బంతుల్లో 4×6) దూకుడుగా ఆడటంతో 4 వికెట్ల నష్టానికి చెన్నై 179 పరుగులు చేయగా.. ఛేదనలో ధావన్‌తో పాటు ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ (21 నాటౌట్: 5 బంతుల్లో 3×6) బ్యాట్ ఝళిపించడంతో లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఢిల్లీ ఛేదించింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరమవగా.. బౌలింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజాకి అక్షర్ పటేల్ మూడు సిక్సర్లు బాదేశాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో శిఖర్ ధావన్‌కి ఇదే తొలి శతకంకాగా.. సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మళ్లీ నెం.1 స్థానానికి దూసుకెళ్లింది. ఆరో పరాజయంతో చెన్నై ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.


వాస్తవానికి 180 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీకి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్
పృథ్వీ షా (0) తొలి ఓవర్‌ రెండో బంతికే ఔటైపోగా.. అనంతరం వచ్చిన అజింక్య రహానె (8: 10 బంతుల్లో 1×4) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ చేతులెత్తేశాడు. దాంతో.. స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న శిఖర్ ధావన్.. బంతులు, పరుగుల మధ్య అంతరం పెరగకుండా చూసుకున్నాడు. దాంతో.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (23: 23 బంతుల్లో 1×4, 1×6), హిట్టర్ స్టాయినిస్ (24: 14 బంతుల్లో 1×4, 2×6), అలెక్స్ క్యారీ (4: 7 బంతుల్లో) మధ్యలో బంతుల్ని వేస్ట్ చేసినా ఆ ప్రభావం ఛేదనపై పడలేదు. గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ.. చూడచక్కని క్లాస్ షాట్లతో అలరించిన ధావన్.. ఎట్టకేలకి కెరీర్‌లో అందని ద్రాక్షగా కనిపించిన ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. తాజా సీజన్‌లో పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీలు నమోదు చేయగా.. ముంబయి ఇండియన్స్ యువ హిట్టర్ ఇషాన్ కిషన్ 99 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ధావన్ కూడా 99 పరుగుల వద్ద కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటైనట్లు కనిపించాడు. ఫీల్డ్ అంపైర్ కూడా వేలెత్తేశాడు. కానీ.. రివ్యూ కోరిన ధావన్ బతికిపోయాడు. బంతి బ్యాట్‌కి టచ్ కాలేదని రిప్లైలో కనిపించింది.

ఢిల్లీ విజయానికి చివరి 24 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో ఒక ఫోర్, సిక్స్ బాది 90లోకి అడుగుపెట్టిన ధావన్.. కాస్త నెమ్మదించాడు. మరోవైపు అలెక్స్ క్యారీ కూడా బంతుల్ని వేస్ట్ చేయడంతో ఢిల్లీ శిబిరంలో కంగారు మొదలైంది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అలెక్స్ క్యారీ ఔటవగా.. ధావన్ సింగిల్స్‌తో సరిపెట్టాడు. దాంతో.. ఆ ఓవర్‌లో వచ్చింది. 4 పరుగులే. అయితే.. అదే ఓవర్‌లో చివరి బంతికి సింగిల్‌తో శతకం పూర్తి చేసుకున్న ధావన్.. చివరి ఓవర్‌లో తొలి బంతికి సింగిల్ తీసివ్వగా.. అక్షర్ పటేల్ వరుసగా 6, 6, 2, 6తో ఒక బంతి మిగిలి ఉండగానే లాంఛనాన్ని పూర్తిచేశాడు.

మ్యాచ్‌లో అంతక ముందు టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శామ్ కరన్ (0) తొలి ఓవర్‌లోనే డకౌటయ్యాడు. సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద నోర్తేజ్ చేతికి కరన్ చిక్కాడు. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (36: 28 బంతుల్లో 6×4) గేర్ మార్చే ప్రయత్నంలో ఔటవగా.. అంబటి రాయుడు (45 నాటౌట్: 25 బంతుల్లో 1×4, 4×6) స్లాగ్ ఓవర్లో భారీ షాట్లు బాదేశాడు. ధోనీ (3) ఔటయ్యే సమయానికి 16.3 ఓవర్లలో 129/4తో నిలిచిన చెన్నై టీమ్ ఆఖరికి 179 పరుగులు చేయగలిగిందంటే అది జడేజా హిట్టింగ్ చలవే. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో తుషార్‌కి ఒక సిక్స్ బాదిన జడేజా.. 18వ ఓవర్‌లో రబాడానీ వదల్లేదు. ఇక ఆఖరి ఓవర్‌ వేసిన నోర్తేజ్‌కి వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో.. చెన్నై ఊహించని స్కోరుని అందుకుంది. రాయుడు- జడేజా జోడీ కేవలం 21 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకోవడం విశేషం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *