delhi man suicide attempt: ముంబైలో సూసైడ్ ప్లాన్.. fb లో చూసిన ఐర్లాండ్ ఉద్యోగి.. ఢిల్లీ పోలీసుల ఆపరేషన్ – how facebook ireland employee saved delhi man’s life from suicide attempt in mumbai


సోషల్ మీడియా ద్వారా అనర్థాలే కాదు, మంచి పనులు కూడా జరుగుతాయని ఇప్పటికే చాలా సార్లు ఫ్రూవ్ అయింది. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైన వారిని ఫేస్‌బుక్ సాయంతో చివరి క్షణాల్లో కాపాడిన ఘటనలు ఇంతకుముందు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే.. ఇప్పుడు చదవబోయేది కాస్త ప్రత్యేకమైంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా జీవితం తలకిందులై, బతుకు భారమై ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైన ఓ యువకుడిని ఫేస్‌బుక్ కాపాడింది. ఢిల్లీకి చెందిన బాధితుడు ఆత్మహత్యకు పాల్పడబోతున్నాడని గుర్తించి అలర్ట్ చేసింది ఐర్లాండ్‌లో ఫేస్‌బుక్ కార్యాలయంలోని ఉద్యోగి కావడం విశేషం.

అయితే.. ఇదేమంత ఈజీగా జరగలేదు. చాలా ట్విస్టులు ఉన్నాయి. ఐర్లాండ్ నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు బాధితుడి అడ్రస్ వెతుక్కుంటూ వెళితే అక్కడ అతడి భార్య మాత్రమే ఉండటం మొదటి ట్విస్టు. బాధితుడు ముంబైలో ఉన్నాడని తెలిసిన తర్వాత పోలీసులు తమకు మిగిలి ఉన్న కొద్ది సమయంలో ఏం చేశారు? ఆ యువకుడి ప్రాణాలు ఎలా కాపాడారు? అనేది ఇక్కడ ఆసక్తిదాయకం.

శనివారం (ఆగస్టు 8) రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ యువకుడు అందుకు సంబంధించిన సంకేతాలనిచ్చే వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియోలను ఐర్లాండ్‌లో ఫేస్‌బుక్ కార్యాలయ ఉద్యోగి గమనించాడు. వెంటనే ఆ ఫేస్‌బుక్ అకౌంట్ ప్రాథమిక వివరాలు పరిశీలించి ఫోన్ నంబర్ ట్రేస్ చేశాడు. ఫోన్ నంబర్ దొరికిందిగా అని వెంటనే బాధితుడికి ఫోన్ చేయలేదు. అలా చేస్తే అతడు తన నిర్ణయాన్ని వేగంగా అమలు చేస్తాడని భావించి పోలీసులను సంప్రదించాడు.

ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ఐర్లాండ్ ఉద్యోగి.. ఢిల్లీ డీసీపీ (సైబర్) అన్వేశ్ రాయ్‌ నంబర్ సంపాదించి ఆయనకు ఫోన్ చేశారు. యువకుడి ఆత్మహత్యాయత్నం గురించి ఆయనకు వివరించి ఆ కాంటాక్ట్ నంబర్ షేర్ చేశాడు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు. ఇక అప్పటి నుంచి పోలీసుల ఆపరేషన్ ప్రారంభమైంది. వారి ముందు ఉంది చాలా తక్కువ సమయం. కాలంతో పరుగెడుతూ బాధితుడిని కాపాడాలి.

ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కొద్ది క్షణాల్లోనే ఆ ఇంటి అడ్రస్ ట్రేస్ చేశారు. ఆ ఇల్లు తూర్పు ఢిల్లీలో ఉన్నట్లు తేలడంతో డీసీపీ రాయ్ వెంటనే తూర్పు మండలం డీసీపీ జగ్మీత్ సింగ్‌కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులు ఆ అడ్రస్‌కు చేరుకునే సరికి అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ప్రాణాలు తీసుకోబోతున్న వ్యక్తి అక్కడ లేడు.

Must Watch:మిరాకిల్.. ఆ యాక్సిడెంట్ జరగకపోతే అతడు బతికే వాడే కాదు

పోలీసులు తొలుత అడ్రస్ తప్పేమో అని అనుమానించారు. ఎందుకైనా మంచిదని మెల్లిగా ఆ ఇంట్లో వాళ్లతో మాట్లాడి కూపీ లాగారు. ఆ ఫోన్ నంబర్ గురించి ఆరా తీయగా అది తనదేనని ఓ మహిళ చెప్పింది. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియోల గురించి ప్రశ్నించగా.. ఆ అకౌంట్‌ను తన భర్త వాడుతున్నాడని తెలిపింది. అతడి గురించి ఆరా తీయగా రెండు వారాల కిందట తనతో గొడవపడి ముంబై వెళ్లిపోయాడని చెప్పింది. అక్కడ ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడని తెలిపింది. కానీ, ముంబైలో అతడు ఎక్కడు ఉంటున్నాడో వారి వద్ద అడ్రస్ లేదు. కానీ, ఆ మహిళ తన భర్త ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చింది. అదే ఉపయోగపడింది.

అసలు విషయం తెలియగానే డీసీపీ రాయ్.. ముంబై సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరాందికర్‌కు ఫోన్ కలిపారు. విషయం చెప్పారు. కానీ, ఇక్కడే పెద్ద చిక్కొచ్చిపడింది. బాధితుడి భార్య ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా అతడి చిరునామాను ట్రేస్ చేయలేకపోయారు. అసలు ఆ ఫోన్ నంబర్ ముంబై అడ్రస్‌తోనే లేదు. మరి ఏం చేయాలి? ఇక్కడే ఢిల్లీ, ముంబై పోలీసులు సమన్వయంతో పనిచేశారు.

ఈ ఆపరేషన్ ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకునే సరికే 2 గంటల పుణ్యకాలం గడిచిపోయింది. పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. వీలైనంత తొందరగా బాధితుడిని చేరుకోవాలి. అతడిని రక్షించాలి. ఈలోగా ఫేస్‌బుక్ అకౌంట్‌లో మరో రెండు వీడియోలు పోస్టు చేశాడు బాధితుడు. ఆత్మహత్య ఘట్టానికి మరింత దగ్గరయ్యాడు. అప్పుడే ఢిల్లీ పోలీసులకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

బాధితుడి తల్లితో అతడికి వాట్సాప్ వీడియో కాల్ చేయించారు. ఆ ఫోన్ కాల్ మాట్లాడుతుండగానే అవతల అడ్రస్ ట్రేస్ చేయాలని పోలీసుల ప్లాన్. కానీ, ఆ వీడియో కాల్ ఒక్క రింగుకే కట్ అయిపోయింది. పోలీసుల్లో మళ్లీ నిరాశ. కానీ, కొద్ది క్షణాలకే అవతలి నుంచి మరో నంబర్‌ ద్వారా వీడియో కాల్ వచ్చింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతడిని మాటల్లో పెట్టించి తమ పని పూర్తి చేశారు.

బాధితుడు కాల్ చేసిన ఫోన్ నంబర్, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతడి అడ్రస్ గుర్తించి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అందుకు గంట సమయం పట్టింది. ఓ పోలీస్ అధికారి అంతసేపూ అతడితో ఫోన్లో మాట్లాడుతూ కౌన్సెలింగ్ చేశారు. ఆ తర్వాత ఆ ఇంటికి చేరుకొని అతడిని కాపాడారు. ఇదంతా పూర్తయ్యే సరికి సమయం అర్ధరాత్రి 1.30 గంటలైంది.

పోలీసులు బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి అతడి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం చిక్కుల్లో పడి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని.. తమతో పాటు ఇటీవల పుట్టిన తన బిడ్డను ఎలా పెంచాలో అర్థంకాక కఠిన నిర్ణయం తీసుకున్నానని బాధితుడు పోలీసులతో చెప్పాడు. ఐర్లాండ్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అద్భుతంగా పనిచేయడం వల్లే అతడిప్పుడు ప్రాణాలతో ఉన్నాడు.

Don’t Miss:పిల్లల ‘టీవీ’ పాఠాల కోసం తాళి తాకట్టు పెట్టిన తల్లి

Also Read:మీది ఇండియా కాదా: ఎంపీ కనిమొళికి సొంత నగరంలో చేదు అనుభవంSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *