Donald Trump: కరోనా మానవ సృష్టికాదని నిఘా వర్గాలు స్పష్టం చేసినా, ట్రంప్ మాత్రం ఎందుకిలా? – us president donald trump says evidence ties china lab to virus, threatens tariffs


ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొత్తరకం కరోనా వైరస్‌ను జన్యుపరంగా సృష్టించలేదని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. కానీ, నిఘా వర్గాలు వెల్లడించిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వైరస్ విషయంలో చైనాపై ఆరోపణలు గుప్పించారు. చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.

అంతేకాదు, దీనికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ వివరాలను బయటపెట్టడానికి మాత్రం నిరాకరించిన ట్రంప్… దీనిపై ఇంకా లోతైన విచారణ జరుగుతోందని.. త్వరలోనే వాటి ఫలితాలు బయటకు వస్తాయని ఉద్ఘాటించారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని అంత బలంగా ఎలా చెప్పగలరని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. నేను ఆ విషయాలు బయటకు చెప్పలేను. అలా చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అయితే, ఈ విషయంలో తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను బాధ్యుణ్ని చేయలేనన్నారు. కానీ, తొలినాళ్లలోనే వైరస్‌ను నియంత్రించి ఉండాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా కట్టడి చేయలేకపోయిందా.. లేదా కావాలనే నిర్లక్ష్యం వహించిందా అన్నది పక్కనబెడితే.. దీని ప్రభావం మాత్రం ప్రపంచంపై భారీ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించారు.

బహుశా కీలక సమయంలో స్పందించకపోయి ఉండడం వల్లే పరిస్థితి చేజారిపోయి ఉంటుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దీనికి ఇటలీలో పరిస్థితిని ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, అసలు చైనాలో ఏం జరిగిందన్నది మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని.. దానిపైనే విచారణ జరుగుతోందని ట్రంప్ వివరించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు.

కాగా, కరోనా వైరస్‌ మానవులు సృష్టించింది కాదని అమెరికా నిఘా వర్గాలు అంతకు ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే అది జన్యు మార్పిడి ద్వారా తయారైంది కూడా కాదని వివరించాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది గుర్తించనున్నట్లు వెల్లడించాయి.

వచ్చే నవంబరులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ట్రంప్ ముందుకెళ్తున్నారు. వైరస్ విషయంలో చైనాను దోషిగా నిలబెట్టి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అందులో భాగంగానే చైనాను బూచిగా చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను తిరిగి గెలవకుండా చైనా ఏమైనా చేయగలదని, దీనికి నవంబరులో వెలుగుచూసిన కరోనా వైరస్‌ విషయంలో వ్యవహరించిన తీరే సాక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఇటీవల ట్రంప్ విమర్శలు గుప్పించారు.

బుధవారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ విషయంలో చైనా నుంచి భారీగానే నష్టపరిహారం పొందే విషయంపై దృష్టి సారిస్తున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *