farmer buys flight tickets: వలస కూలీలకు విమాన టిక్కెట్లు బుక్ చేసిన రైతు.. అన్నదాతా వందనం – delhi farmer buys flight tickets to send 10 migrant workers home in bihar


లాక్‌డౌన్‌తో చేసేందుకు పనిలేక, తినడానికి తిండిలేక కాలినడకన, సైకిళ్ల మీద వేలాది కిలోమీటర్ల దూరం సొంతూర్లకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు దేశాన్ని కంటతడి పెట్టించాయి. కేంద్రం వారికి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో శ్రామిక్ రైళ్లు సహా ఇతర మార్గాల ద్వారా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. అయితే.. ఈ క్రమంలో కొంత మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మరణిస్తుండగా.. మరికొంత మంది ఆకలితో, ఎండతీవ్రతతో సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోతుండటం మానవతావాదుల గుండెలను పిండేస్తోంది.

ఇలాంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఢిల్లీకి చెందిన ఓ రైతు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తన వద్ద పనిచేస్తున్న 10 మంది కూలీలను స్వస్థలాలకు పంపించడానికి ఏకంగా విమాన టిక్కెట్లు బుక్ చేయించాడు. ఇందుకోసం రూ.70 వేలు వెచ్చించాడు. తద్వారా ఢిల్లీ సమీపంలోని తిగిపూర్ గ్రామానికి చెందిన పుట్టగొడుగుల రైతు పప్పన్ సింగ్ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఆ కూలీలను పప్పన్ సింగ్ గత రెండు నెలలుగా తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నాడు. ఇన్ని రోజులూ వారికి ఆశ్రయం కల్పించి, కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఇప్పుడు బిహార్‌లోని వారి స్వస్థలాలకు పంపించడానికి విమాన టిక్కెట్లు బుక్ చేయించి ఇచ్చాడు. అంతేకాదు, పాట్నా విమానాశ్రయం నుంచి సహర్సా జిల్లాలోని వాళ్ల సొంతూరుకు బస్సును కూడా బుక్ చేయడం విశేషం.

‘వాళ్లందరూ (కూలీలు) నా సొంత మనుషుల లాంటి వారు. తమ సొంతూర్లకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. వాళ్లు వెళ్లే మార్గంలో ఏదైనా జరగకూడనిది జరిగితే నేనే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎండలు తీవ్రమైన వేళ రైలు ప్రయాణం కూడా వారికి మంచిది కాదని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నా. విమానం అయితే వారిని సురక్షితంగా గమ్యం చేరుస్తుందని భావిస్తున్నా..’ అని పప్పన్ సింగ్ తెలిపారు.

పప్పన్ సింగ్ టికెట్లు బుక్ చేసిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం (మే 28) ఉదయం 6 గంటలకు పాట్నా బయల్దేరి వెళ్లనుంది. పప్పన్ సింగ్ వాళ్లందరికీ దగ్గరుండి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. విమాన ప్రయాణానికి అవసరమైన పత్రాలన్నింటినీ అందజేశాడు.

రైతు పప్పన్ సింగ్ తమపట్ల చూపిస్తున్న ఆదరణకు వలస కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘నేను జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా..’ అని చెబుతూ ఓ కూలీ లఖిందర్ రామ్ భావోద్వేగానికి గురయ్యాడు. అయితే.. ఎయిర్‌పోర్టుకు చేరిన తర్వాత ఏం చేయాలి? ఎలా విమానం ఎక్కాలి? అనే విషయాల పట్ల తనకు ఆందోళనగా ఉందని అతడు చెప్పాడు.

తన వద్ద పనిచేస్తున్న ఆ కూలీల కోసం పప్పన్ సింగ్ అంత చేయడానికి కారణం కూడా లేకపోలేదు. వారిలో కొంత మంది అతడి వద్ద రెండు దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేస్తున్నారు. అంతేకాదు, వ్యవసాయం ద్వారా తాను ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నానంటే.. అది ఆ కూలీల శ్రమ ఫలితమేనని పప్పన్ సింగ్ నిజాయతీగా చెబుతున్నాడు. ఇన్ని రోజులు ఆ కూలీలు చేసిన సేవకు తాను ఇలా గౌరవం ఇస్తున్నానని పప్పన్ సింగ్ చెప్పడం అతడి మంచి మనసును తెలియజేస్తోంది.

Don’t Miss:మరణించిన అమ్మను లేపేందుకు చిన్నారి ప్రయత్నం.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం

Also Read:ఇండియా Vs చైనా.. ఎంట్రీ ఇచ్చిన అమెరికాSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *