gautam gambhir trolls: గంభీర్ నీ ఎమోజీ నవ్వింది..! జోక్ పేల్చిన యువరాజ్ – yuvraj singh hilariously trolls gautam gambhir on his latest instagram post


టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కి ముక్కోపి అని పేరుంది. 2003 నుంచి దాదాపు 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్‌లాడిన గౌతమ్ గంభీర్.. మైదానంలో నవ్వుతూ కనిపించింది చాలా తక్కువ. గ్రౌండ్‌లోనే కాదు.. వెలుపల కూడా అతను సీరియస్‌గా ఉండటంతో.. సహచరులు సైతం అతనిపై జోక్‌లు పేల్చేందుకు సాహసించేవారు కాదు. ఒకవేళ ఎవరైనా నోరుజారితే..? గంభీర్ ఏమాత్రం ఉపేక్షించకుండా గొడవకి దిగేవాడు. ఈ క్రమంలో ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో గంభీర్ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.


గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘకాలం క్రికెట్ ఆడిన యువరాజ్ సింగ్.. తాజాగా ఈ మాజీ ఓపెనర్‌పై ఓ జోక్ పేల్చాడు. 2018లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ గంభీర్.. ఎన్నికల్లో బరిలోకి దిగి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. వలస కూలీలు, పేదలకి గంభీర్ నిత్యావసరాలు సాయం చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో తాజాగా తన ఫొటోని షేర్ చేసిన గౌతమ్ గంభీర్.. పెదవుల్ని వంచిన తీరుని వర్ణిస్తూ ‘‘ఈ ఫొటోని చూసిన తర్వాత అవుట్‌స్వింగ్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి నేరుగా స్లిప్‌లోకి వెళ్తున్నట్లు ఉంది’’ అని క్యాప్షన్ రాసుకొచ్చి దానికి నవ్వుతున్న ఎమోజీని జతచేశాడు. దాంతో.. యువరాజ్ సింగ్ ఫన్నీగా స్పందిస్తూ ‘‘పోనీలే.. కనీసం నీ ఎమోజీ అయినా నవ్వింది’’ అని జోక్ పేల్చాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *