ఏపీలోకి అనుమతించేది లేదు, ఎక్కడి వారు అక్కడే.. డీజీపీ కీలక వ్యాఖ్యలు.

నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వచ్చిన వారిని కూడా రెండు వారాల పాటు క్వారంటైన్‌‌లో ఉంచిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు జోడించి చేసిన అభ్యర్థనను అర్థం చేసుకొని అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.


నిబంధనలు పాటించకుండా సరిహద్దు వద్దకు వచ్చిన వారిని కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతస్తామని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ ఉద్దేశమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా నిరోధించడమేనని, ఇతర ప్రాంతాల నుంచి ఏపీలోకి అనుమతించడం లాక్‌ డౌన్‌ ఉద్దేశాన్ని నీరు గార్చడమేనని అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని ఎక్కడివారు అక్కడే స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఙప్తి చేశారు.

కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరిన విద్యార్థులు, ఉద్యోగులను ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతివ్వడం లేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఏపీలోకి అనుమతి లేదని.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని తేల్చి చెప్పారు. దీంతో వందలాది వాహనాలు సరిహద్దు వద్దే నిలిచిపోయాయి. ఆంధ్రాలోకి రాకుండా తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చేవరకు ఏమి చేయలేమని పోలీసులు తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *