Hyderabad Coronavirus: కరోనా దాడి.. ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్, మరొకరు మృతి – six corona positive cases in a family in hyderabad’s vanasthalipuram


హైదరాబాద్‌లో మర్కజ్‌‌కు వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్న వ్యక్తులకు సంబంధించి ఆరా కొనసాగుతూనే ఉంది. వీరికి కిరాణా సరకులు అమ్మే దుకాణదారులతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించడం, వారిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడం సంచలనం రేపుతోంది. అందులో ఒకరు మృతిచెందారు. దీంతో అధికారులు కరోనా వచ్చిన ఇంటి పరిసరాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు.

గడ్డిఅన్నారం డివిజన్‌ శారదానగర్‌కు చెందిన వ్యక్తి మలక్‌పేటలో నూనె వ్యాపారం చేస్తున్నాడు. జ్వరంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం వనస్థలిపురంలోని సోదరుడి ఇంటికి వచ్చాడు. సాధారణ జ్వరం అనుకొని స్థానికంగా ఉన్న జీవన్‌సాయి ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందాడు. అనుమానంతో గాంధీ ఆసుపత్రికి తరలించి, అతడి సోదరుడి కుటుంబ సభ్యులను ఇంటిలోనే క్వారంటైన్‌ చేశారు. ఈ క్రమంలో అతడి సోదరుడి తండ్రి(70)కి కూడా కరోనా ఉన్నట్లు తెలిసింది. ఆయనకు అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉండడంతో వృద్ధుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందాడు. మొదట కరోనా పాజిటివ్‌గా తేలిన నూనె వ్యాపారి నుంచి అతడి భార్యకు, సోదరుడికి, సోదరుడి భార్య, ఇద్దరు కూతుళ్లకూ వైరస్‌ సంక్రమించిందని అధికారులు గుర్తించారు.

వనస్థలిపురంలో అధికారుల పర్యటన
వనస్థలిపురంలో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో డీఎం అండ్ హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు కాలనీని సందర్శించారు. సంబంధిత ప్రాంతంలో రెడ్‌ జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

వనస్థలిపురంలోని ఆ ప్రైవేటు ఆసుపత్రి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. డబ్బులకోసం వైద్యం చేసిన ఆసుపత్రి తీరును వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆస్పత్రిపై ఓ బీజేపీ నాయకుడు కూడా రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ప్రైవేటు ఆస్పత్రిపై కేసు కూడా నమోదు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *