Jathi Ratnalu Movie Dubbing: బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్.. సీఎం గారికి థ్యాంక్స్: సీనియర్ నటుడు నరేష్ – senior actor vk naresh starts dubbing for jathi ratnalu movie post covid lockdown


తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన సినిమా పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ అనుమతితో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీకే నరేష్.. ‘జాతిరత్నాలు’ సినిమా కోసం డబ్బింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలోని డబ్బింగ్ థియేటర్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్వీట్ చేశారు.

‘‘నిన్న ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు అభయం ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారికి. ఈరోజున మొట్టమొదటి సారిగా డబ్బింగ్ థియేటర్ ఓపెన్ చేసి ‘జాతిరత్నాలు’ సినిమాకి డబ్బింగ్ స్టార్ట్ చేశాం. బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్‌ని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ బాగుండాలి. పది మందికి పని జరగాలి. ధైర్యంగా ముందుకు వెళ్దాం. జాగ్రత్తలు తీసుకుందాం. ప్రభుత్వం, పరిశ్రమ ఎటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినా పాటించి కచ్చితంగా ప్రభుత్వం మన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్దాం’’ అని నరేష్ వీడియోలో వెల్లడించారు.

Also Read:నన్నే ఎవరూ పిలవలేదు.. నేను బాలయ్యను పిలవాలా: సి.కళ్యాణ్‌కు నరేష్ కౌంటర్

ఒక సీనియర్ ఆర్టిస్ట్‌గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డబ్బింగ్ కార్యక్రమాన్ని తొలుత తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నరేష్ అన్నారు. ‘జాతి రత్నాలు’ సినిమాతోనే రామానాయుడు స్టూడియోలోని డబ్బింగ్ థియేటర్ లాక్‌డౌన్ తరవాత తిరిగి తెరుచుకుందని నరేష్ తెలిపారు. ఇండస్ట్రీ బాగు కోసం అందరం ఆ దేవుడిని ప్రార్థిద్దామని అన్నారు. డబ్బింగ్ థియేటర్‌లో తాను డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్‌ను కూడా ఈ వీడియోలో నరేష్ పొందుపరిచారు. కరోనాతో మనమంతా కలిసి జీవించాల్సి ఉందని.. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక బోల్డ్ స్టెప్‌తో ముందుకు వెళ్లక తప్పదని నరేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన నిర్ణయం సహచర నటీనటులకు ప్రేరణగా నిలవాలన్నారు.

కాగా, ‘జాతిరత్నాలు’ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. మురళీ శర్మ, వీకే నరేష్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోహర్ సిద్ధమ్ సినిమాటోగ్రఫీ అందించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా థియేటర్లు తెరుచుకున్నాక విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నవీన్, రాహుల్, ప్రియదర్శి ఖైదీలుగా కనిపించారు.

samayam telugu

‘జాతిరత్నాలు’ ఫస్ట్ లుక్ పోస్టర్Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *