nimmagadda ramesh: నిమ్మగడ్డ రమేష్‌కు వైసీపీ షాక్: ఎస్ఈసీకి 6 ప్రశ్నలు.. ఆ భేటీపై తేల్చేసింది! – ysrcp mla ambati rambabu declares that ysrcp don’t participate all party meeting with sec nimmagadda ramesh kumar


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి షాకిచ్చింది. బుధవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎస్ఈసీకి 6 ప్రశ్నలు సంధించారు. అలాగే నిమ్మగడ్డ రమేష్‌పై పదునైన విమర్శలు గుప్పించారు. ఆ లేఖలో ఏముందు అంబటి రాంబాబు మాటల్లోనే..

‘‘1. స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమావేశానికి ముందు సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చదువుకుని ఈ సమావేశాలను నిర్వహిస్తే బాగుండేది. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది, తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని! మరి ఎస్‌ఈసీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అని చీఫ్‌ సెక్రటరీ గాని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రటరీ గాని ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ముందు రాజకీయ పార్టీలను పిలవటంలోనే.. ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లటం అనేది సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేస్తోంది.

2. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ∙ సాధ్యాసాధ్యాల మీద చర్చ అంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో రాజకీయానికి తెరతీశారు. ఎందుకు ఈమాట అనాల్సి వస్తుందంటే.. ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీతోనూ, మొత్తంగా ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఒక వంక వారి అభిప్రాయాలు ఏంటో తీసుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా, రాజకీయ పార్టీలను పిలిచి, వన్‌ టు వన్‌ సమావేశం అంటూ పిలవడం కచ్చితంగా నిమ్మగడ్డ– చంద్రబాబు రాజకీయంలో భాగమే.

3. రాష్ట్ర ప్రభుత్వంతోనే చర్చించకుండా రాష్ట్రంలో ఉనికే లేని, పోటీయే చేయని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను నిమ్మగడ్డ పిలిచారంటే దీని మర్మం ఏంటో మరో 24 గంటల్లోనే అందరికీ తెలుస్తుంది.

4. రాష్ట్రంలో 3 కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ చెప్పాలి. ఇప్పుడు దాదాపు రోజుకు 3 వేల కేసులు నమోదు అవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవచ్చా? అని రమేష్‌కుమార్‌ అడుగుతున్నారంటే దీని వెనుక ఆయన ఉద్దేశాలు ఏంటో, దీని వెనుక ఎవరున్నారో స్పష్టం అవుతుంది.

5. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వందకు వంద శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లలో విజయం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసం మాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంది. అయినా ఎన్నికల నిర్వహణ అంటే అందులో ఓటువేసే ఓటరు.. అంటే 3 కోట్ల ప్రజల భద్రతను, ఆ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే టీచర్లు మొదలు ఉద్యోగ సోదర, సోదరీమణులు మొదలు, పోలీసులు వరకు ప్రతి ఒక్కరి భద్రతకూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాధ్యత వహిస్తారా?

6. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల వాయిదా తర్వాత 2 ఉత్తరాలు రాశారు. అందులో 2వ ఉత్తరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, మా పార్టీ అధ్యక్షుడి మీద అత్యంత తీవ్రమైన దిగజారుడు పద్ధతుల్లో వాడకూడని పదజాలాన్ని వాడి ఆరోపణలు చేశారు. తనకు ప్రాణభయం ఉందని, మా పార్టీది ఫ్యాక్షనిస్ట్‌ ధోరణి అని, గూండాలమని, సంఘవ్యతిరేక శక్తులు అంటూ లేఖలు రాసిన చరిత్ర నిమ్మగడ్డ రమేశ్‌ది. అధికార పార్టీమీద ఇంత తీవ్రమైన అంసతృప్తి, పక్షపాతం, అసహనం, ద్వేషం, వ్యతిరేక అజెండా ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక్కో పార్టీకి 10 నిమిషాలు అంటూ అజెండాతో సమావేశాన్ని పెడితే దానికి హాజరు కావటం గాని, సుప్రీం కోర్టు తీర్పునకు భిన్నంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ముందుకు వెళ్తున్న ఆయన ధోరణిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోంది.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కాకుండా హైదరాబాద్‌లో ఎవరూ గుర్తుపట్టకుండా స్టార్‌ హోటళ్లలో చీకటి సమావేశాలు జరిపే వ్యక్తిగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు గుర్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి స్పష్టం చేస్తోంది. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని చెప్తున్నాం.’’ అని అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *