nimmagadda ramesh kumar: ఎస్‌ఈసీ తొలగింపు: పేరు లేకుండా ఫైలు నడిపారు.. లోపాలను ఎత్తిచూపిన హైకోర్టు! – ap government moving sec sacked ordinance file without naming find high court


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తప్పిస్తూ వైఎస్ఆర్సీపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకురాగా.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం తొలగించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు ఆర్డినెన్స్‌ తదనంతరం జారీ అయిన జీవోలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, ఆర్డినెన్స్ ఫైలులో పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వం వ్యవహరించినట్టు ధర్మాసనం గుర్తించింది. శుక్రవారం ఇచ్చిన సంచలన తీర్పులోని మరికొన్ని కీలకాంశాలివీ..

‘కొత్త ఎస్‌ఈసీగా తగిన వ్యక్తిని నియమించాలని కోరుతూ పేరు ప్రస్తావించకుండా గవర్నర్‌ ఆమోదం కోసం ఏప్రిల్‌ 10న మధ్యాహ్నం 3.29కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫైల్‌‌ను సమర్పించారు. అదే రోజు సాయంత్రం 4.02 గంటలకు జస్టిస్‌ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించేందుకు బయోడేటాను గవర్నర్‌కు ముఖ్యమంత్రి సమర్పించారు. అంటే పేరు లేకుండానే తొలుత ఫైల్‌ నడిచినట్లు అర్థమవుతోంది. ఆర్డినెన్స్‌‌పై గవర్నర్ సంతకం చేసిన ఉత్తర్వులు జారీచేశాక రమేశ్‌కుమార్‌ను ఏప్రిల్‌ 10 నుంచి ఎస్‌ఈసీగా నిలుపుదల చేశారు.

రాత్రి 9.45కి ఫైల్‌-3ని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రారంభించి రాత్రి 10.07 గంటలకు డిజిటల్‌ సంతకం చేశారు. తర్వాత జీవో 618ని ఆయన సంతకంతో జారీచేశారు. ఫైల్‌-3కి అసలు గవర్నర్‌ ఆమోదమే లేదు. అధికరణ 243(కె) ప్రకారం ఎస్‌ఈసీని గవర్నర్‌ విచక్షణాధికారం మేరకు నియమిస్తారు తప్ప.. మంత్రివర్గం సలహాతో కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలి. కమిషన్‌కు స్వతంత్రత ఉంటే.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతాయి.

ఎన్నికల కమిషనర్ల నియామకంలో రాజకీయ జోక్యానికి తావుండకూడదు. అందుకే ఎస్‌ఈసీ నియామకంలో గవర్నర్‌కు విచక్షణాధికారం ఇచ్చారు. ఎవర్ని నియమించాలనేది కూడా గవర్నర్‌ విచక్షణే. ఫలానా అర్హతలున్న వ్యక్తినే ఎస్‌ఈసీగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేవు. ఎన్నికల సంస్కరణల పేరుతో ఎస్‌ఈసీ పదవీకాలాన్ని మూడేళ్లుగా పేర్కొనడం సమర్థనీయం కాదు. ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు నియమితులై ప్రభుత్వ ఇష్టం మేరకు వ్యవహరించకపోతే మొదటి మూడేళ్లు గడిచాక, ఆయన కొనసాగింపునకు ప్రభుత్వం సిఫారసు చేయదు. చెప్పినట్లు వింటే మరో మూడేళ్లకు తిరిగి నియమించుకోవచ్చు. దానివల్ల ఎస్‌ఈసీకి స్వతంత్రత ఉండదు.

ఆర్డినెన్స్‌ అమల్లోకి వచ్చినరోజు అప్పటికే ఎస్‌ఈసీగా పనిచేస్తున్న అధికారి పదవి కోల్పోతారని పేర్కొనడం చట్టవిరుద్ధం. చట్టసవరణ చేసిన తర్వాత అది అమల్లోకి వస్తుంది తప్ప.. గతానికి వర్తింపజేయడానికి వీల్లేదు.

అధికరణ 243కేతో పాటు పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200 (2) ప్రకారం రమేశ్‌కుమార్‌ నియామకానికి గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్‌ కనగరాజ్‌ విషయంలో పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 200కి సవరణ చేసి ఆర్డినెన్స్‌ జారీచేయడం ద్వారా ఓ యజమానిలా గవర్నర్‌ నియమించారు తప్ప అధికరణ 243కే ప్రకారం తన విచక్షణాధికారాన్ని వినియోగించలేదు. ముఖ్యమంత్రి ఇష్టం మేరకు కొత్త ఎస్‌ఈసీని నియమించారు. రమేశ్‌కుమార్‌ ఐదేళ్ల కాలపరిమితితో ఎస్‌ఈసీగా నియమితులయ్యారు. ఆయన పదవీకాల హక్కును ప్రభుత్వం నిరాకరించడానికి వీల్లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న రమేశ్‌కుమార్‌ను పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి తొలగించడం రాజ్యాంగ విరుద్ధం.

ఎస్‌ఈసీ నియామకం విషయంలో ముందుగా అర్హతలు నిర్ణయిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ కోరిక మేరకు ఆర్డినెన్స్‌ తెచ్చారే గానీ, ఇందులో ప్రజాహితం లేదు. ప్రభుత్వ చర్య రాజ్యాంగం అధికారాన్ని వంచించడమే’ అని పేర్కొంది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశాక ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి, అసెంబ్లీ కార్యదర్శి, మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలను తీర్పులో ప్రస్తావించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్‌ వలీ శనివారం సుప్రీంకోర్టులో కెవియెట్‌ దాఖలుచేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *