oxford vaccine: వ్యాక్సిన్ ఫలితాలు రాకుండానే తయారీకి ఒప్పందం.. తొలి దశలో 40 కోట్ల డోసులు ఉత్పత్తి! – oxford coronavirus vaccine gets manufacturing push from astrazeneca, finalised an agreement on thrusday


కరోనా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రయోగ దశలోనే ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేయడానికి ఓ వైపు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ప్రపంచంలోనే తొలి ఒప్పందం గురువారం కుదిరింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందిస్తున్న ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ ఉత్పత్తికి బ్రిటన్‌-స్వీడన్‌ బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం. తొలుత 40 కోట్ల డోసుల మేర వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంమీద 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లు తెలిపాయి.

అయితే ఈ కంపెనీకి అమెరికా బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బార్డా) నుంచి ఒక బిలియన్ డాలర్లకుపైగా నిధులు సమకూరాయి. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా కోసం ఈ మొత్తాన్ని బార్డా అందజేసింది. దీంతో కోవిడ్‌-19 వ్యాక్సిన్లను పూర్తిగా చేజిక్కించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తొలి విడత టీకాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో సరఫరా చేస్తామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించే మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సహకారం అందజేస్తామని వివరించింది.

ఇందులో భాగంగా 30వేల మంది వలంటీర్లపై ప్రయోగాలు జరుగుతున్నాయని, చిన్నారులపైనా దీనిని ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. ‘సీహెచ్‌ఏడీఓఎక్స్‌1 ఎన్‌కోవ్‌-19’గా ఉన్న ఈ ప్రయోగాత్మక టీకా పేరు.. ప్రస్తుత ఒప్పందంతో ఏజెడ్‌1222గా మారింది. సాధ్యమైనంత వేగంగా, విస్తృతంగా కొవిడ్‌-19 టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని పేర్కొంది. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కుదిరిన ఒప్పందంపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాక్సిన్ పనిచేయకపోయే అవకాశమూ ఉందని, ఆ విషయం కూడా తమకు తెలుసనని ఆస్ట్రాజెనెకా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ రిస్క్ తీసుకుని ఉత్పత్తి చేయడానికి సిద్ధపడ్డామని ఉద్ఘాటించింది. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ భారత్‌లో పుణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టనుంది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడం తమకు చాలా గర్వంగా ఉందని, ప్రపంచస్తాయి ఔషదంగా మార్చడానికి వారు అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారని ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియోట్ అన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీకి తాము చేయాల్సింది చేస్తామని, దీనిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన వైరస్‌కు వ్యాక్సిన్ సరఫరాను నిర్ధారించడానికి డబ్ల్యూహెచ్ఓ, గవీతోనూ తాము చర్చిస్తున్నట్టు తెలిపారు.

తొలుత ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 30-40 కోట్ల డోసులు అమెరికాకు చేరే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్‌ నాటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలా ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ఇప్పటికే ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అమెరికాలో టీకా ఉత్పత్తిని వేగంగా చేపట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’లో ఇది భాగమని చెబుతున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *