Rishi Kapoor: ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్ – rishi kapoor admitted to hospital with breathing difficulties


బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించినట్లు అతని సోదరుడు రణధీర్ కపూర్ తెలిపారు. రిషికపూర్ నిన్నరాత్రి అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ముంబైలోని హెచ్ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో రిషికపూర్ వెంట అతని భార్య నీతూకపూర్ కూడా ఉన్నారు. రిషికపూర్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన కుమారుడు ప్రముఖహీరో రణబీర్ కపూర్ బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. రిషికపూర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రిషికపూర్ కు 2018లో కేన్సర్ రావడంతో న్యూయార్క్ లో చికిత్స పొందారు. చికిత్స అనంతరం కోలుకున్న రిషికపూర్ తో కలిసి భోజనం చేస్తున్న చిత్రాన్ని అతని సతీమణి ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లాక్ డౌన్ సందర్భంగా యోగా చేస్తున్న రిషికపూర్ ఫోటో కూడా అతని భార్య పెట్టారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవడంతో రిషికపూర్ ను ఆసుపత్రికి తరలించారు. బాబీతో పాటు పలు ప్రజాదరణ పొందిన చిత్రాల్లో నటించిన రిషికపూర్ తాజాగా వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు.

రిషికపూర్ వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. బాలీవుడ్‌లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా రిషికపూర్ వెలుగు వెలిగారు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. రిషికపూర్‌ రాజ్‌కపూర్‌ రెండవ కుమారుడు. సెప్టెంబరు 4, 1952న ముంబైలో జన్మించాడు. వారిది పంజాబీ కుటుంబం. అన్న రణధీర్, తమ్ముడు రాజీవ్‌తో కలిసి ముంబైలోని కూపరేజ్‌ రోడ్డులో వున్న క్యామ్పియన్‌ పాఠశాలలో చదివాడు. అజ్మీర్‌ లోని చారిత్రాత్మక మేయో కళాశాలలో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ అలనాటి హీరోలు షమ్మికపూర్, శశికపూర్‌ ఇద్దరూ రిషికి బాబాయిలు. ఇక క్యారక్టర్‌ నటుడు ప్రేమనాథ్, హాస్యనటుడు రాజేంద్రనాథ్‌ రిషి కపూర్‌కు మేనమామలు. రీతు నందా, రీమా జైన్‌ ఇద్దరూ రిషికపూర్‌కు అక్క చెల్లెళ్లు. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాలో రిషి కపూర్‌ చిన్ననాటి రాజ్‌కపూర్‌గా నటించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *