Unicef report: కరోనా ఎఫెక్ట్.. 8.6 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి: యునిసెఫ్ సంచలన నివేదిక – number of children living in household poverty to soar by up to 86 million by end of year says unicef


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో ఈ ఏడాది చివరికి 8.6 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే ఇది ఒకేసారి 15శాతం పెరుగుతుందని గురువారం వెల్లడించిన తాజా నివేదికలో పేర్కొంది. అంతేకాదు, కరోనా ప్రభావంతో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు తక్షణమే చేపట్టకపోతే.. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 67.2కోట్ల మంది చిన్నారులు జాతీయ పేదరిక స్థాయికన్నా దిగువకు పడిపోతారని యునిసెఫ్‌ హెచ్చరించింది.

అలాగే, దాదాపు మూడింట రెండొంతుల మంది చిన్నారులు మధ్య సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణాసియాలోనే జీవిస్తున్నారని వివరించింది. ముఖ్యంగా ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని, ఈ ప్రాంతంలో ఇది 44 శాతం, లాటిన్ అమెరికా, కరేబియా దీవుల్లో 22 శాతం మేర పెరుగుతుందని తెలిపింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఉన్న వనరులు తరిగిపోతూ..సామాజిక, ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతున్నట్లు యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రీఎట్టా ఫోర్‌ వెల్లడించారు.

కుటుంబాల్లో ఏర్పడే ఈ ఆర్థిక సమస్యలు పేదరికాన్ని తగ్గించే ప్రక్రియను మరింత నెమ్మదింపజేస్తాయని తెలిపారు. అంతేకాకుండా, ఇది పిల్లలకు కావాల్సిన కనీస అవసరాలకు దూరం చేసే ప్రమాదం ఉందని హెన్నీఎట్టా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అలాంటి కుటుంబాలకు కనీస అవసరాలైన ఆహారం, నీరు, చదువు, వైద్య సదుపాయాలను అందించకుంటే.. వారు జీవితంలో చవిచూడని పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థలు హెచ్చరించాయి.

కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై రెండింతలు ఎక్కువగా ఉంటుందని సేవ్ ది చిల్డ్రన్, యునిసెఫ్‌లు హెచ్చరించాయి. తక్షణ ఆదాయాన్ని కోల్పోవడం అంటే, ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ, విద్యను పొందే అవకాశాలు తగ్గిపోతాయి.. బాల్య వివాహాలకు దారితీసి, హింస, దోపిడీ, దుర్వినియోగం వంటి ముప్పు పెరిగిపోతుందని వ్యాఖ్యానించాయి. ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు, కుటుంబాలు ఆధారపడిన సేవల నాణ్యత కూడా తగ్గిపోతుందని తెలిపాయి.

‘కోవిడ్ -19 మహమ్మారి పేదరికంపై తీవ్ర ప్రభావం చూపి పిల్లలను తీవ్రంగా దెబ్బతీస్తుంది… ఆకలి, పోషకాహార లోపానికి కూడా చిన్నారులు ఎక్కువగా గురవుతారు.. అది వారిని జీవితాంతం ప్రభావితం చేస్తుంది.. ప్రస్తుతం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే, మహమ్మారి వల్ల పేద దేశాలు, పిల్లలు ఎదుర్కొంటున్నముప్పును నిరోధించవచ్చు.. ఈ నివేదిక ప్రపంచానికి మేల్కొలుపుగా ఉండాలి… పిల్లలకు పేదరికం అనివార్యం కాదు’ అని చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ సీఈఓ ఇంగేర్ అషింగ్ అన్నారు.

‘కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల మంది చిన్నారులకు సామాజిక భద్రత లేదని, ప్రస్తుతం సంక్షోభం కుటుంబాలు తాకినప్పుడు ఆర్థిక నష్టాలను తట్టుకోవడం అసాధ్యం.. రాబోయే తరాలకు పేదరికం చక్రాన్ని మరింత పెంచుతుంది. ఆఫ్రికాలో 16 శాతం మంది పిల్లలు మాత్రమే సామాజిక రక్షణలో ఉన్నారు.. లక్షలాది మంది పిల్లలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, సరైన పోషకాహారం, తగినంత వసతి అందుబాటులో లేదు.. సామాజిక భద్రత గురించి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుంది’ అని నివేదిక పేర్కొంది.

‘ఇప్పటికే అంతర్గత సంఘర్షణ, హింసలతో సతమతమవుతోన్న దేశాలలో నివసిస్తున్న పిల్లలకు.. ఈ సంక్షోభం మరింత అస్థిరత, పేదరికంలో పడేసే ప్రమాదాన్ని పెంచుతుంది. మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో సంఘర్షణ కారణంగా అత్యధిక సంఖ్యలో పేదరికం.. యువతలో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉంది.. ఈ ప్రాంతంలోని దాదాపు సగం మంది పిల్లలు దుర్బర పేదరికంలో నివసిస్తున్నారు’ అని నివేదిక స్పష్టం చేసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *